Logo

హోషేయ అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

02 రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.

03 యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

04 ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును.

05 కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటి మాటలచేత వారిని వధించి యున్నాను.

06 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.

07 ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు.

08 గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి.

09 బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై యున్నారు,

10 ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు.

11 చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును.