Logo

లేవీయకాండము అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా

02 యెహోవా సన్నిధినుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతిబొందిరి.

03 అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఇది యెహోవా చెప్పిన మాట నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచుకొందును;

04 అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధస్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొనిపోవుడని వారితో చెప్పెను.

05 మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొనిపోయిరి.

06 అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.

07 యెహోవా అభిషేకతైలము మీమీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్లకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి.

08 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు

09 మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు.

10 మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,

11 యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

12 అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు.

13 కావున మీరు పరిశుద్ధస్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.

14 మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు, అనగా నీవును నీతోపాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు.

15 హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొనిరావలెను. నిత్యమైన కట్టడచొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను.

16 అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయియుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి

17 మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలి పశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధము గదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.

18 ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.

19 అందుకు అహరోను మోషేతో ఇదిగో నేడు పాపపరిహారార్థబలి పశువును దహనబలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైనబలి ద్రవ్యమును నేడు తినినయెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను.

20 మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.