Logo

లేవీయకాండము అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి

02 అహరోనుతో ఇట్లనెను నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొనిరమ్ము.

03 మరియు నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలినర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱపిల్లను

04 సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొనిరండి; నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము.

05 మోషే ఆజ్ఞాపించినవాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొనివచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా

06 మోషే మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను.

07 మరియు మోషే అహరోనుతో ఇట్లనెను నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము.

08 కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థబలిగా ఒక దూడను వధించెను.

09 అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.

10 దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలిపీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

11 దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను.

12 అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తమునప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను.

13 మరియు వారు దహనబలి పశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠముమీద వాటిని దహించెను.

14 అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను.

15 అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాపపరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటిదానివలె దీనిని పాపపరిహారార్థబలిగా అర్పించెను.

16 అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధిచొప్పున దానినర్పించెను.

17 అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలి గాక బలిపీఠముమీద తీసినదానిని దహించెను.

18 మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలి రూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను.

19 మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను అప్పగించిరి.

20 బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహించెను.

21 బోరలను కుడిజబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

22 అప్పుడు అహరోను పాపపరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను.

23 మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.

24 యెహోవా సన్నిధినుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి.