Logo

1కొరిందీయులకు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

02 మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడైయుండుట అవశ్యము.

03 మీచేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

04 నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.

05 కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనినిగూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును.

06 సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకనిమీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నామీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.

07 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగినవాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?

08 ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?

09 మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.

10 మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.

11 ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసము లేక యున్నాము;

12 స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము;

13 దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.

14 మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను.

15 క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.

16 క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

17 ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీయొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.

18 నేను మీయొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.

19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.

20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే యున్నది.

21 మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?