Logo

1కొరిందీయులకు అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా?

02 ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనైయున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?

03 నన్ను విమర్శించువారికి నేను చెప్పు సమాధానమిదే.

04 తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?

05 తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?

06 మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా?

07 ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువుచేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు?

08 ఈ మాటలు లోకాచారమునుబట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పుచున్నదిగదా?

09 కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి యున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?

10 కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.

11 మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?

12 ఇతరులకు మీపైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదుగదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.

13 ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని యుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?

14 ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు.

15 నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.

16 నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినయెడల నాకు శ్రమ.

17 ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.

18 అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము

19 నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.

20 యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.

21 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలెఉంటిని.

22 బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

23 మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

24 పందెపురంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.

26 కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడను కాను,

27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.