Logo

1కొరిందీయులకు అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

02 ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను.

03 బీదల పోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

04 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

05 అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

06 దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

07 అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

08 ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

09 మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని

10 పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.

11 నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

12 ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.

13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.