Logo

1కొరిందీయులకు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.

02 మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనేగాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నయెడల ఆ సువార్తవలననే మీరు రక్షణ పొందువారైయుందురు.

03 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,

04 లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

05 ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

06 అటుపిమ్మట ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

07 తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

08 అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

09 ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను.

10 అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని.

11 నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.

12 క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

13 మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.

14 మరియు క్రీస్తు లేపబడి యుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

15 దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.

16 మృతులు లేపబడనియెడల క్రీస్తుకూడ లేపబడలేదు.

17 క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.

18 అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.

19 ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము.

20 ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.

21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

23 ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.

24 అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.

25 ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.

26 కడపట నశింపజేయబడు శత్రువు మరణము.

27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే.

28 మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

29 ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందువారేమిచేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?

30 మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో నుండనేల?

31 సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.

32 మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.

33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

34 నీతిప్రవర్తన గలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.

35 అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.

36 ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.

37 నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు.

38 అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.

39 మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు.

40 మరియు ఆకాశ వస్తురూపములు కలవు, భూ వస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూ వస్తురూపముల మహిమ వేరు.

41 నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదుగదా

42 మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;

43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరముకూడ ఉన్నది.

45 ఇందువిషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడి యున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.

46 ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మ సంబంధమైనది.

47 మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.

48 మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి యెట్టివాడో పరలోక సంబంధులును అట్టివారే.

49 మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము.

50 సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.

52 బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.

53 క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.

54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

55 ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?

56 మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.

57 అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.