Logo

సంఖ్యాకాండము అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

02 నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను

03 ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.

04 అతిపరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా

05 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

06 దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

07 సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దానిమీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱబట్ట పరచి

08 దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

09 మరియు వారు నీలిబట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెరచిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి

10 దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను.

11 మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టను పరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

12 మరియు తాము పరిశుద్ధస్థలములో సేవచేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను.

13 వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి

14 దానిమీద తమ సేవోపకరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లుగరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.

15 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.

16 యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పైవిచారణలోనికి అతని భారము.

17 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

18 మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.

19 వారు అతిపరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికియుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను.

20 వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.

21 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

22 గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.

23 ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పనిచేయ చేరువారందరిని లెక్కింపవలెను.

24 పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ;

25 వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను

26 మందిరముచుట్టును బలిపీఠముచుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను.

27 గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయువాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటిమాటచొప్పున జరుగవలెను. వారు జరుపువాటినన్నిటిని జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.

28 ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పనిచేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద నుండవలెను.

29 మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.

30 ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.

31 ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను

32 దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.

33 మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.

34 అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని

35 యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి.

36 వారి వారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది.

37 ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగినవారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి.

38 గెర్షోనీయులలో వారివారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని

39 యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమ తమ వంశముల చొప్పునను

40 తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరువందల ముప్పదిమంది.

41 ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.

42 మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

43 అనగా ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు

44 అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింపబడినవారు మూడువేల రెండువందలమంది.

45 మెరారీయుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.

46 మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులును లెక్కించిన లేవీయులలొ

47 ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

48 అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడినవారు ఎనిమిదివేల ఐదువందల ఎనుబదిమంది.

49 యెహోవా నోటి మాటచొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతివాడును తన తన సేవనుబట్టియు తన తన మోతనుబట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి.