Logo

సంఖ్యాకాండము అధ్యాయము 19

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

02 యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొనిరావలెనని వారితో చెప్పుము.

03 మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.

04 యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;

05 అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను.

06 మరియు ఆ యాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.

07 అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

08 దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

09 మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్రస్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను; అది పాపపరిహారార్థబలి.

10 ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.

11 ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.

12 అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసికొననియెడల ఏడవ దినమున పవిత్రుడు కాడు.

13 నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును.

14 ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.

15 మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును.

16 బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవమునైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.

17 అపవిత్రుని కొరకు వారు పాపపరిహారార్థమైన హోమభస్మములోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మముమీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.

18 తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునేగాని సమాధినేగాని ముట్టినవానిమీదను దానిని ప్రోక్షింపవలెను.

19 మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమున పవిత్రుడగును.

20 అపవిత్రుడు పాపశుద్ధి చేసికొననియెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహారజలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.

21 వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహారజలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరిహారజలమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము.

22 దాని ముట్టు మనుష్యులందరు సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.