Logo

సంఖ్యాకాండము అధ్యాయము 36

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే యెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి

02 ఆ దేశమును వంతుచీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవానికాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను.

03 అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారినెవరినైనను పెండ్లి చేసికొనినయెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతుచీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును.

04 కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్రస్వాస్థ్యము తగ్గిపోవుననగా

05 మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే.

06 యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.

07 ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.

08 మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.

09 స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను.

10 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి.

11 సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసికొనిరి.

12 వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను.

13 యెరికోయొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులును ఆజ్ఞలును ఇవే.