Logo

సంఖ్యాకాండము అధ్యాయము 27

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.

02 వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయెను.

03 అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమునుబట్టి మృతిబొందెను.

04 అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంతమాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి.

05 అప్పుడు మోషే వారికొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా

06 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము.

07 నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనముచేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.

08 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడులేక మృతిబొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.

09 వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.

10 వానికి అన్నదమ్ములు లేనియెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను.

11 వాని తండ్రికి అన్నదమ్ములు లేనియెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.

12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.

13 నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు.

14 ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నులయెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.

15 అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.

16 అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి,

17 వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.

18 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యియుంచి

19 యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నులయెదుట అతనికి ఆజ్ఞయిమ్ము;

20 ఇశ్రాయేలీయుల సర్వసమాజము అతని మాట వినునట్లు అతనిమీద నీ ఘనతలో కొంత ఉంచుము.

21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.

22 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి

23 అతనిమీద తనచేతులుంచి యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.