Logo

1సమూయేలు అధ్యాయము 22

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.

02 మరియు ఇబ్బంది గలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండువారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందలమంది వచ్చియుండిరి.

03 తరువాత దావీదు అక్కడనుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలిసికొనువరకు నా తలిదండ్రులు వచ్చి నీయొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవిచేసి

04 అతని యొద్దకు వారిని తోడుకొనిపోగా దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతనియొద్ద కాపురముండిరి.

05 మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారెతు అడవిలో చొచ్చెను.

06 దావీదును అతని జనులును ఫలానిచోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచులవృక్షము క్రింద దిగి యీటె చేతపట్టుకొని యుండెను. అతని సేవకులు అతనిచుట్టు నిలిచియుండగా

07 సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా?

08 మీరెందుకు నామీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే.

09 అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని.

10 అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా

11 రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా

12 సౌలు అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను.

13 సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా

14 అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు?

15 అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటివారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా

16 రాజు అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి

17 యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీద పడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలివారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా

18 రాజు దోయేగుతో నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడి ఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను.

19 మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగవారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను.

20 అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి

21 సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా

22 దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా.

23 నీవు భయపడక నాయొద్ద ఉండుము, నాయొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయ చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.