Logo

1సమూయేలు అధ్యాయము 19

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా

02 సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతొ ఇట్లనెను నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీద నున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము.

03 నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రియొద్ద నిలిచి నిన్నుగూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్నుగూర్చి నాకేమైన తెలిసినయెడల దానిని నీతో తెలియజెప్పుదుననెను.

04 యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చి దయగా మాటలాడి నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు గాక.

05 అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా

06 సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణము చేసెను.

07 అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను.

08 తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధచేయగా

09 యెహోవా యొద్దనుండి దురాత్మ సౌలుమీదికి వచ్చెను. సౌలు ఈటెచేత పట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా

10 సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.

11 ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి

12 కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.

13 తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి

14 సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియై యున్నాడని చెప్పెను.

15 దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొనిరండని వారితో చెప్పగా

16 ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.

17 అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు నెనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.

18 ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి.

19 దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా

20 దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.

21 ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి.

22 కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చిసమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను.

23 అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చువరకు ప్రకటించుచుండెను,

24 మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.