Logo

1సమూయేలు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము

02 సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా.

03 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను.

04 అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.

05 అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చిన లోయలో పొంచియుండి

06 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలోనుండి వెళ్లిపోయిరి.

07 తరువాత సౌలు అమాలేకీయులను హవీలానుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి

08 అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను

09 సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱపిల్లలు మొదలైన వాటిలోను మంచివాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి.

10 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

11 సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.

12 ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.

13 తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా

14 సమూయేలు ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి? అని అడిగెను.

15 అందుకు సౌలు అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి; మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలము చేసితిమనగా

16 సమూయేలు నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను.

17 అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.

18 మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా

19 నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను.

20 అందుకు సౌలు ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని.

21 అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను.

22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.

23 తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా

24 సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.

25 కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను.

26 అందుకు సమూయేలు నీతోకూడ నేను తిరిగిరాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి

27 వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.

28 అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీచేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.

29 మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు.

30 అందుకు సౌలు నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడ తిరిగిరమ్మని అతనిని వేడుకొనినందున

31 సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత

32 సమూయేలు అమాలేకీయులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా

33 సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను.

34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను.

35 సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదు గాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను.