Logo

1సమూయేలు అధ్యాయము 29

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగియుండిరి; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జెల దగ్గర దిగియుండిరి.

02 ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహపరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి.

03 ఫలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్దనుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నాయొద్ద చేరిన నాటనుండి నేటివరకు ఇతనియందు తప్పేమియు నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను.

04 అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడి ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధియవునేమో, దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును? మనవారి తలలను ఛేదించి తీసికొనిపోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.

05 సౌలు వేలకొలదిగాను దావీదు పదివేలకొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి.

06 కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే;నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటి వరకు నీయందు ఏ దోషమును నాకు కనబడలేదుగాని సర్దారులు నీయందు ఇష్టములేక యున్నారు.

07 ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా

08 దావీదు నేనేమి చేసితిని? నా యేలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీ దాసుడనై నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను.

09 అందుకు ఆకీషు దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.

10 కాబట్టి ఉదయమున నీవును నీతోకూడ వచ్చిన నీ యజమానుని సేవకులును త్వరగా లేవవలెను; ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను.

11 కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి; ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి.