Logo

2రాజులు అధ్యాయము 18

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ యేలుబడిలో మూడవ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా యేలనారంభించెను.

02 అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె; ఆమెకు అబీ అని పేరు.

03 తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను.

04 ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి

05 అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు.

06 అతడు యెహోవాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను.

07 కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోటనెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.

08 మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.

09 రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సరమందు, ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను.

10 మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను.

11 తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి.

12 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.

13 రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా

14 యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి నావలన తప్పు వచ్చినది; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరువందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను.

15 కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను.

16 మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.

17 అంతట అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా

18 హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారియొద్దకు పోయిరి.

19 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి?

20 యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?

21 నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికిని అట్టివాడే.

22 మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. యెరూషలేమందున్న యీ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా?

23 కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.

24 అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే.

25 యెహోవా సెలవునొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు; ఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను.

26 హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

27 రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి

28 గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా

29 హిజ్కియా చేత మోసపోకుడి; నాచేతిలోనుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

30 యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.

31 హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టుఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును.

32 అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమునకును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.

33 ఆ యా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా?

34 హమాతు దేవతలు ఏమాయెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మాచేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?

35 యెహోవా మాచేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆ యా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మాచేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.

36 అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి.

37 గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.