Logo

యోబు అధ్యాయము 17

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.

02 ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

03 ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?

04 నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.

05 ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును.

06 ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.

07 నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను

08 యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.

09 అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

10 మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడి మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు.

11 నా దినములు గతించెను నా యోచన నిరర్థకమాయెను నా హృదయవాంఛ భంగమాయెను.

12 రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.

13 ఆశ యేదైన నాకుండినయెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను

14 నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.

15 నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ యెవనికి కనబడును?

16 ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.