Logo

యోబు అధ్యాయము 26

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

02 శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?

03 జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచన చెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి?

04 నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి? ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?

05 జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు.

06 ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.

07 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.

08 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.

09 దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.

10 వెలుగు చీకటుల సరిహద్దులవరకు ఆయన జలములకు హద్దు నియమించెను.

11 ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయమొంది అదరును

12 తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.

13 ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.

14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?