Logo

యోబు అధ్యాయము 23

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

02 నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది

03 ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

04 ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.

05 ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.

06 ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా? ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును

07 అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన శిక్ష నొందకపోవుదును.

08 నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుటలేదు

09 ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను.

10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

11 నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించితిని.

12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.

13 అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.

14 నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడైయున్నాడు.

15 కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.

16 దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.

17 అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి యుండలేదు.