Logo

యోబు అధ్యాయము 28

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.

02 ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు.

03 మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.

04 జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించువారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు అటు అల్లాడుచుందురు.

05 భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.

06 దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.

07 ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు

08 గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు

09 మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.

10 బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.

11 నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు

12 అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?

13 నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.

14 అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును.

15 సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.

16 అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.

17 సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.

18 పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది

19 కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.

20 అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?

21 అది సజీవులందరి కన్నులకు మరుగైయున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడియున్నది.

22 మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును.

23 దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.

24 ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.

25 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

26 వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు

27 ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.

28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.