Logo

యోబు అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

02 నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును.

03 అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను

04 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

05 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

06 దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగానుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.

07 అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.

08 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును

09 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు?

10 జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

11 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?

12 వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు

13 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

14 ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.

15 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.

16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావలక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు.

17 ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొనిపోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

18 రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.

19 యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొనిపోవును స్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.

20 వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.

21 అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.

22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును

23 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

24 భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచును త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.

25 వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.