Logo

రోమీయులకు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యేసుక్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును,

02 దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.

03 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగుగాక,

04 దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానము చేసెను.

05 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

06 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితివిు.

07 మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడియున్నారు.

08 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసుక్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

09 ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీయొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగునేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,

10 మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.

11 మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని

12 ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.

13 సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నాకిష్టములేదు

14 గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.

15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.

16 సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.

17 ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

18 దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

19 ఎందుకనగా దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.

20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

22 వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

24 ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌.

26 అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.

27 అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి

28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమనస్సుకు వారినప్పగించెను.

29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

30 కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును

31 మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.

32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.