Logo

రోమీయులకు అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.

02 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.

03 తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.

04 ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,

05 ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

06 మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,

07 ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

08 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగి యుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

09 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొనియుండుడి.

10 సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.

11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.

12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

13 పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.

14 మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

15 సంతోషించు వారితో సంతోషించుడి;

16 ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితోనొకడు మనస్సు కలిసియుండుడి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

17 కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి.

18 శక్యమైతే మీచేతనైనంతమట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.

20 కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

21 కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయించుము.