Logo

రోమీయులకు అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు

02 ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడైయుండి, కూరగాయలనే తినుచున్నాడు.

03 తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.

04 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

05 ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను.

06 దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.

07 మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.

08 మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువు వారమై యున్నాము.

09 తాను మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు ఇందునిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను.

10 అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము.

11 నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు

12 అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

13 కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.

14 సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.

15 నీ సహోదరుడు నీ భోజనమూలముగా దుఃఖంచినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొనువాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.

16 మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.

17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.

18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.

19 కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయువాటినే ఆసక్తితో అనుసరింతము.

20 భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము.

21 మాంసము తినుటగాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరునికడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.

22 నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు.

23 అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషియని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.