Logo

రోమీయులకు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమైయున్నాము.

02 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

03 క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

04 ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధకలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.

05 మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము,

06 క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.

07 కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి.

08 నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచారకుడాయెను.

09 అందువిషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.

10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు

11 మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది.

12 మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనులనేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.

13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిపొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

14 నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మునుగూర్చి రూఢిగా నమ్ముచున్నాను.

15 అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవునిచేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని

16 ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.

17 కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు.

18 ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నాద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను.

19 కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.

20 నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు,

21 వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైయుండి ఆలాగున ప్రకటించితిని.

22 ఈ హేతువు చేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.

23 ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్ష కలిగి,

24 నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంతమట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.

25 అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్యచేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.

26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.

27 అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారైయున్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు

28 ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణముచేతును.

29 నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును.

30 సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును,

31 నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును,

32 మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తునుబట్టియు, ఆత్మవలని ప్రేమనుబట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

33 సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడైయుండును గాక. ఆమేన్‌.