Logo

రోమీయులకు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.

02 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.

03 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను

04 పనిచేయువానికి జీతము ఋణమే గాని దానమని యెంచబడదు.

05 పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

06 ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.

07 ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

08 ప్రభువుచేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,

09 ఈ ధన్యవచనము సున్నతి గలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతి లేనివారినిగూర్చికూడ చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా?

10 మంచిది; అది ఏ స్థితియందు ఎంచబడెను? సున్నతి కలిగియుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగియుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.

11 మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రియగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.

12 మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.

13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదు గాని విశ్వాసమువలననైన నీతిమూలముగానే కలిగెను.

14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును.

15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేకపోవును.

16 ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసము గలవారికికూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

17 తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియై యున్నాడు ఇందునుగూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18 నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20 అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

23 అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని

24 మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను.

25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.