Logo

రోమీయులకు అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.

02 తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?

03 ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.

04 అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.

05 ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలియున్నది.

06 అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

07 ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి.

08 ఇందువిషయమై నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

09 మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.

10 వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.

11 కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.

12 వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటువలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

13 అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనైయున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,

14 వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను.

15 వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయినయెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.

17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలుపొందినయెడల, ఆ కొమ్మలపైన

18 నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.

19 అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు.

20 మంచిది; వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

21 దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టనియెడల నిన్నును విడిచిపెట్టడు.

22 కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహప్రాప్తుడవై నిలిచియున్నయెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువనియెడల నీవును నరికివేయబడుదువు.

23 వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు.

24 ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడినయెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవచెట్టున అంటుకట్టబడరా?

25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26 వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27 నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

28 సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.

29 ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

30 మీరు గతకాలమందు దేవునికి అవిధేయులైయుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింపబడితిరి.

31 అటువలెనే మీయెడల చూపబడిన కరుణనుబట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు

32 అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.

33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

34 ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?

35 ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు?

36 ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.