Logo

నిర్గమకాండము అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరోమీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.

02 కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.

03 యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.

04 మోషే ఫరోతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలువెళ్లెదను.

05 అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలి పిల్లలన్నియు చచ్చును

06 అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.

07 యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.

08 అప్పుడు నీ సేవకులైన వీరందరు నాయొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలువెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరోయెద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను

09 అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.

10 మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.