Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

02 నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి

03 రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.

04 మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.

05 ఆయన సెలవిచ్చినదేమనగా నేను నా జనులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగానుండుటకై యే మనుష్యునియైనను నేను నియమింపలేదు.

06 ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగానుండుటకై దావీదును కోరుకొంటిని.

07 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రియైన దావీదు మనోభిలాష గలవాడాయెను.

08 అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని

09 నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.

10 అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి

11 యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచితినని చెప్పి

12 ఇశ్రాయేలీయులందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.

13 తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను.

14 యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు.

15 నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు.

16 నీవు నాముందర నడచినట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీయుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము.

17 ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.

18 మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?

19 దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్నపమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.

20 నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రింబగళ్లు నిలుచునుగాక.

21 నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.

22 ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతనిచేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు

23 నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.

24 నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టియెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగివచ్చి నీ నామమును ఒప్పుకొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల

25 ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.

26 వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగినయెడల

27 ఆకాశమందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి,నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక.

28 దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడివేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను

29 ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి

30 నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీయందు భయభక్తులు కలిగి

31 నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగినవాడవు గదా.

32 మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, చాచిన చేతులనుగూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు

33 నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.

34 నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరుకొనిన యీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినయెడల

35 ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.

36 పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్రహించి, శత్రువులచేతికి వారిని అప్పగింపగా, చెరపట్టువారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా

37 వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసితివిు, దోషులమైతివిు, భక్తిహీనముగా నడచితివిు అని ఒప్పుకొని

38 తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామ ఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల

39 నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక.

40 నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపముమీద నీ కనుదృష్టి యుంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.

41 నా దేవా, యెహోవా, బలమునకాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.

42 దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము,నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.