Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 36

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.

02 యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.

03 ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి

04 అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అను మారు పేరుపెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసికొనిపోయెను.

05 యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత

06 అతనిమీదికి బబులోనురాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై గొలుసులతో బంధించెను.

07 మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసికొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను.

08 యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటనుగూర్చియు, అతని సకల ప్రవర్తననుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.

09 యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను

10 ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను.

11 సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొకటేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను.

12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను.

13 మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.

14 అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.

15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన

16 పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.

17 ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలివారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతని చేతికప్పగించెను.

18 మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.

19 అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడుచేసిరి.

20 ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.

21 యిర్మీయాద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతిదినముల ననుభవించెను.

22 పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

23 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేరవచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.