Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాము షెకెమునకు పోయెను.

02 రాజైన సొలొమోను సమక్షమునుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.

03 యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;

04 నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవిచేయగా

05 అతడు మీరు మూడు దినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.

06 అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను సజీవియైయుండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి--యీ జనులకు నేనేమి ప్రత్యుత్తరమియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా

07 వారు నీవు ఈ జనులయెడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలాడినయెడల వారు ఎప్పటికిని నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి.

08 అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి, తనతోకూడ పెరిగి తన యెదుటనున్న యౌవనస్థులతో ఆలోచనచేసి

09 నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా

10 అతనితో కూడ పెరిగిన యీ యౌవనస్థులు అతనితో ఇట్లనిరి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగా నా చిటికెనవ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;

11 నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.

12 మూడవ దినమందు నాయొద్దకు తిరిగిరండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా

13 రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి

14 వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను; ఎట్లనగా నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను.

15 యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను.

16 రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు దావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.

17 అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.

18 రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను.

19 ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.