Logo

లూకా అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లుచుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి.

02 అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా

03 యేసు వారితో ఇట్లనెను తానును తనతో కూడ ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అదియైనను మీరు చదువలేదా?

04 అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతో కూడ ఉన్నవారికిని ఇచ్చెను గదా అనెను.

05 కాగా మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను.

06 మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడిచెయ్యి గలవాడొకడుండెను.

07 శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి;

08 అయితే ఆయన వారి ఆలోచనలెరిగి, ఊచచెయ్యి గలవానితో నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను.

09 అప్పుడు యేసు విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి

10 వారినందరిని చుట్టు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.

11 అప్పుడు వారు వెఱ్ఱి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.

12 ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.

13 ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.

14 వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,

15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను,

16 యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు.

17 ఆయన వారితో కూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండియు, యెరూషలేము నుండియు, తూరు సీదోనను పట్టణముల సముద్రతీరముల నుండియు వచ్చిన బహు జనసమూహమును,

18 అపవిత్రాత్మలచేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి.

19 ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను.

20 అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది.

21 ఇప్పుడు అకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.

22 మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు.

23 ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

24 అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు.

25 అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.

26 మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

27 వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,

28 మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థన చేయుడి.

29 నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము.

30 నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొనిపోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు.

31 మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.

32 మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా

33 మీకు మేలు చేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా

34 మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా.

35 మీరైతే ఎట్టి వారినిగూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.

36 కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి.

37 తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;

38 క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.

39 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా.

40 శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.

41 నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల?

42 నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

43 ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు.

44 ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు.

45 సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.

46 నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?

47 నాయొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును.

48 వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను.

49 అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను