Logo

లూకా అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఘనత వహించిన థెయొఫిలా,

02 ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

03 గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట

04 వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.

05 యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.

06 వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.

07 ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)

08 జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించుచుండగా

09 యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను.

10 ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా

11 ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా

12 జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.

13 అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

14 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,

15 తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై,

16 ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

17 మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.

18 జెకర్యా యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా

19 దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.

20 మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.

21 ప్రజలు జెకర్యా కొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.

22 అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను

23 అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను.

24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు

25 నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను.

26 ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో

27 దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.

28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.

29 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా

30 దూత మరియా, భయపడకుము; దేవుని వలన నీవు కృపపొందితివి.

31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.

33 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

34 అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

35 దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

36 మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;

37 దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.

38 అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్దనుండి వెళ్లెను.

39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి

40 జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

41 ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను

42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును

43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను?

44 ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

45 ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

46 అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.

47 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను

48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.

49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.

50 ఆయనకు భయపడు వారిమీద ఆయన కనికరము తరతరములకుండును.

51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను

53 ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

54 అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు

55 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.

56 అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతో కూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

57 ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

58 అప్పుడు ప్రభువు ఆమెమీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

59 ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా

60 తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.

61 అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి

62 వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి.

63 అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.

64 వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.

65 అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమల యందంతట ప్రచురమాయెను.

66 ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులనుగూర్చి వినిన వారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.

67 మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను

68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక

69 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను

70 తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా

71 మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.

72 దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను.

73 ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన

74 అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును

75 మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవితకాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని

76 పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.

77 మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన

78 తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.

79 మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.

80 శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను.