Logo

లూకా అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి,

02 ఆ సరస్సు తీరముననున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.

03 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను.

04 ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా

05 సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.

06 వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా

07 వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.

08 సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ల యెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.

09 ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయమొందిరి.

10 ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.

11 వారు దోనెలను దరికి చేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

12 ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.

13 అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను.

14 అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను

15 అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను.

16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను.

17 ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.

18 ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచము మీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని

19 జనులు గుంపుకూడి యుండినందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక, ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.

20 ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి యున్నవని వానితో చెప్పగా,

21 శాస్త్రులును పరిసయ్యులును దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి.

22 యేసు వారి ఆలోచనలెరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు?

23 నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?

24 అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి, నీ మంచమెత్తికొని నీ యింటికి వేల్లుమని నీతో చెప్పుచున్నాననెను

25 వెంటనే వాడు వారి యెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.

26 అందరును విస్మయమొంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.

27 అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా

28 అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను.

29 ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజనమునకు కూర్చుండిరి.

30 పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.

31 అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు.

32 మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

33 వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరిసయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.

34 అందుకు యేసు పెండ్లికుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటివారిచేత మీరు ఉపవాసము చేయింపగలరా?

35 పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను.

36 ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు.

37 ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును.

38 అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను.

39 పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.