Logo

లూకా అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి

02 నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి.

03 అందుకాయన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి.

04 యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారినడుగగా

05 వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల--ఆలాగైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.

06 మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని

07 అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.

08 అందుకు యేసు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితోననెను.

09 అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాలముండెను.

10 పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.

11 మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.

12 మరలనతడు మూడవవాని పంపగా వారు వానిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి.

13 అప్పుడా ద్రాక్షతోట యజమానుడు నేనేమిచేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను.

14 అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితోనొకరు ఆలోచించుకొని

15 అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?

16 అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాకనిరి.

17 ఆయన వారిని చూచి ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి?

18 ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలైపోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.

19 ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.

20 వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగులవారిని ఆయన యొద్దకు పంపిరి.

21 వారు వచ్చి బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీవెవనియందును మోమోటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము.

22 మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి

23 ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి.

24 దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి.

25 అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.

26 వారు ప్రజల యెదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.

27 పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి.

28 బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన యెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను

29 యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను.

30 రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.

31 ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.

32 కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?

33 ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.

34 అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు, పెండ్లికియ్యబడుదురు గాని

35 పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు.

36 వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

37 పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు,

38 మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను.

39 తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా,

40 నీవు యుక్తముగా చెప్పితివనిరి.

41 ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు

42 నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండుమని

43 ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.

44 దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.

45 ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు

46 సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు.

47 వారు విధవరాండ్ర యిండ్లను దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.