క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.
02 యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
03 ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
04 పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయియున్నారు.
05 నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
06 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
07 మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.
08 ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడివేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.
09 సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపనియెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.
10 సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆలకించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి.
11 యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు.
12 నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు?
13 మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చజాలను.
14 మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.
15 మీరు మీచేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీచేతులు రక్తముతో నిండియున్నవి.
16 మిమ్మును కడుగుకొనుడి శుద్ధిచేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.
17 కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.
18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లనివగును.
19 మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.
20 సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
21 అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.
22 నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.
23 నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యెము విచారించరు.
24 కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగతీర్చుకొందును.
25 నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను.
26 మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.
27 సీయోనుకు న్యాయము చేతను తిరిగివచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.
28 అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.
29 మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖములు ఎఱ్ఱబారును
30 మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.
31 బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.