Logo

యెషయా అధ్యాయము 45

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

02 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

03 పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.

04 నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

05 నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

06 తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

07 నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.

08 ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.

09 మంటికుండ పెంకులలో ఒక పెంకైయుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

10 నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులనుగూర్చియు నా హస్తకార్యములనుగూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?

12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నాచేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

13 నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును

14 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురు వారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు.

15 ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.

16 విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.

17 యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు.

18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

19 అంధకార దేశములోని మరుగైనచోటున నేను మాటలాడలేదు మాయాస్వరూపుడనైనట్టు3 నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.

20 కూడి రండి జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.

21 మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు? చాలకాలము క్రిందట దాని ప్రకటించినవాడెవడు? యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

22 భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

23 నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.

24 యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్నుగూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు

25 యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.