Logo

యెషయా అధ్యాయము 38

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా

02 అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని

03 యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా

04 యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

05 నీవు తిరిగి హిజ్కియాయొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;

06 ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ విడిపించెదను.

07 యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;

08 ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పదిమెట్లు మరల ఎక్కెను.

09 యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.

10 నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళద్వారమున పోవలసివచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొనియున్నాను.

11 యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేననుకొంటిని.

12 నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తికొనిపోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13 ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడియుండుము.

15 నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచుకొందును.

16 ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు

17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతినుండి విడిపించితివి. నీవీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి.

18 పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు.

19 సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

20 మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.

21 మరియు యెషయా అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.

22 మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.