Logo

యెషయా అధ్యాయము 31

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.

02 అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును.

03 ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.

04 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగివచ్చును.

05 పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.

06 ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి.

07 మీకు మీరు పాపము కలుగజేసికొని మీచేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.

08 నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలుదురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గమెదుటనుండి వారు పారిపోవుదురు

09 వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి.