Logo

యెషయా అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి

02 జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.

03 నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించియున్నాను.

04 బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహమువలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరిశబ్దము వినుడి సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు

05 సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతములనుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు.

06 యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

07 అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును

08 జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరిచూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.

09 యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.

10 ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటికమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

11 లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

12 బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండజేసెదను.

13 సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.

14 అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.

15 పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును

16 వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు.

17 వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యముచేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు

18 వారి విండ్లు యౌవనస్థులను నలుగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు.

19 అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.

20 అది మరెన్నడును నివాసస్థలముగానుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు

21 నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును

22 వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.