Logo

యెషయా అధ్యాయము 42

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

02 అతడు కేకలువేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు

03 నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.

04 భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.

05 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

06 గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

07 యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను.

08 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.

09 మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.

10 సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.

11 అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.

12 ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక

13 యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.

14 చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదన పడు స్త్రీవలె విడువకుండ నేను బలవంతముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచునున్నాను.

15 పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును.

16 వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసికొనివచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును

17 చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.

18 చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలోచించుడి.

19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

20 నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.

21 యెహోవా తన నీతినిబట్టి సంతోషము గలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.

22 అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారు వారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు.

23 మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?

24 యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితివిు వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?

25 కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధబలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.