Logo

యెషయా అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

02 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను

03 కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

04 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?

05 ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

06 అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను.

07 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

08 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ.

09 నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.

10 పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడుగింజల పంట ఒక పడియగును.

11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించువరకు చాల రాత్రివరకు పానము చేయువారికి శ్రమ.

12 వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.

14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

15 అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును

16 సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును.

17 అది మేతబీడుగా నుండును గొఱ్ఱపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

18 భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొనువారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు

19 ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము

20 కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.

21 తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొనువారికి శ్రమ.

22 ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.

23 వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

24 సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లిపోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.

25 దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడియున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

26 ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.

27 వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.

28 వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కుపెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును

29 ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొనిపోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.

30 వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జన చేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటియగును.