Logo

యిర్మియా అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చిన మాట వినుడి.

02 యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.

03 జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.

04 వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు.

05 అవి తాటిచెట్టువలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హాని చేయనేరవు మేలుచేయుట వాటివలనకాదు.

06 యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.

07 జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.

08 జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.

09 తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పనివాని పనియే గదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే.

10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

11 మీరు వారితో ఈలాగు చెప్పవలెను ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.

12 ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

13 ఆయన ఆజ్ఞనియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలోనుండి గాలిని రావించును.

14 తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమునుబట్టి అవమానము నొందుచున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.

15 అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించిపోవును,

16 యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.

17 నివాసినీ, ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్లుటకై నీ సామగ్రిని కూర్చుకొనుము.

18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను.

19 కట కటా, నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించుదును.

20 నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయియున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు.

21 కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.

22 ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాకధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరిధ్వని వినబడుచున్నది.

23 యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.

24 యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధినిబట్టి నన్ను శిక్షింపుము.

25 నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థింపని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతని మింగివేయుచున్నారు, వాని నివాసమును పాడుచేయుచున్నారు.