క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 యెహోవా యొద్దనుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్ష మైన వాక్కు.
02 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
03 రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
04 యెహోవా ఇశ్రాయేలు వారినిగూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చిన మాటలివి.
05 యెహోవా యిట్లనెను సమాధానము లేని కాలమున భీతిచేతను దిగులుచేతను జనులు కేకవేయగా వినుచున్నాము.
06 మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
07 అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.
08 సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించుకొనరు గాని
09 వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.
10 మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము,నేను దూరముననుండు నిన్నును, చెరలోనికిపోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగివచ్చి నిమ్మళించి నెమ్మదిపొందును.
11 యెహోవా వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూలనాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.
12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;
13 నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.
14 నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్నుగూర్చి విచారింపరు.
15 నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.
16 నిన్ను మింగువారందరు మింగివేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడుసొమ్ముగా అప్పగించెదను.
17 వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.
18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును.
19 వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువమంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
20 వారి కుమారులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారినందరిని శిక్షించెదను.
21 వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.
22 అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనైయుందును.
23 ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును.
24 తన కార్యము ముగించువరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.