క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 అతడు ప్రజలకందరికి ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా
02 హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.
03 మమ్మును చంపుటకును, బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును, కల్దీయులచేతికి మమ్మును అప్పగింపవలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. (అని చెప్పిరి)
04 కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనలయధిపతులందరును ప్రజలందురును యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి.
05 మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును యెహోవా మాట విననివారై, యూదాదేశములో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆ యా ప్రదేశములనుండి తిరిగివచ్చిన యూదుల శేషమును,
06 అనగా రాజ దేహసంరక్షకుల కధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి
07 ఐగుప్తు దేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
08 యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను
09 నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము
10 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయించును.
11 అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయును.
12 ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగిపోవును.
13 అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.