క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 యూదా రాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను
02 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను.
03 రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములోనుండి బబులోనునకు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను.
04 బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందిరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
05 అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా యాజకుల యెదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరి యెదుటను ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను
06 ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారినందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక.
07 అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము.
08 నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.
09 అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా
10 ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడమీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి
11 ప్రజలందరి యెదుట ఇట్లనెను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీదనుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.
12 ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడమీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
13 నీవు పోయి హనన్యాతో ఇట్లనుము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను.
14 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికి అప్పగించియున్నాను.
15 అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను హనన్యా వినుము; యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు.
16 కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను.
17 ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.