Logo

యిర్మియా అధ్యాయము 46

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

02 ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండునుగూర్చిన మాట.

03 డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి

04 గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.

05 నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.

06 త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.

07 నైలునదీ ప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి

08 ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.

09 గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.

10 ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నదియొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు.

11 ఐగుప్తు కుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు

12 నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.

13 బబులోనురాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటనుగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

14 ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.

15 నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.

16 ఆయన అనేకులను తొట్రిల్లజేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.

17 ఐగుప్తురాజగు ఫరో యుక్త సమయము పోగొట్టుకొనువాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి.

18 పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్ర ప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే.

19 ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.

20 ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చేయున్నది.

21 పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడలవలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.

22 శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దానిమీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడువలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే

23 లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొరశక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయుదురు.

24 ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును

25 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించుచున్నాను.

26 వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు.

27 నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.

28 నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడైున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశప్రజలను సమూల నాశనము చేసెదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే యెహోవా వాక్కు.