Logo

యిర్మియా అధ్యాయము 44

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తు దేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.

03 మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపమువేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడియున్నవి గదా.

04 మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచు వచ్చితిని గాని

05 వారు అలకింపకపోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవియొగ్గకపోయిరి.

06 కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.

07 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటిబిడ్డలును యూదా మధ్యనుండకుండ నిర్మూలము చేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?

08 మీకు మీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమిమీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్కరింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీచేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?

09 వారు యూదాదేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును యూదా రాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచిపోతిరా?

10 నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.

11 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు కీడు చేయునట్లు,

12 అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదాశేషులను నేను తోడుకొనిపోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు, ఖడ్గము చేతనైనను క్షామముచేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందినవారుగాను ఉందురు.

13 యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గము చేతగాని క్షామము చేతగాని తెగులు చేతగాని శిక్షించెదను.

14 కావున తాము మరలివచ్చి యూదా దేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.

15 అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును,

16 మహా సమాజముగా కూడినవారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,

17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

18 మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.

19 మేము ఆకాశరాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండివంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా

20 యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను

21 యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.

22 యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను.

23 యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను.

24 మరియు యిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.

25 ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీచేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.

26 కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాటవినుడి యెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయుచున్నాను.

27 మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తు దేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.

28 ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తు దేశములోనుండి యూదా దేశమునకు తిరిగివచ్చెదరు, అప్పడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.

29 మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.

30 అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.