క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 యోషీయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
02 యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.
03 వారి దుర్మార్గమునుబట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో.
04 నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా
05 మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.
06 మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.
07 యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.
08 జనులకందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు.
09 యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.
10 యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులోనుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా
11 యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజలతోను ఈలాగనిరి మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.
12 అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెను ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.
13 కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.
14 ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.
15 అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసులమీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.
16 కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.
17 మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.
18 యూదా రాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములవలె అగును.
19 అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చుకొందుము అని చెప్పిరి.
20 మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.
21 రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.
22 అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;
23 వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసికొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.
24 ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనులచేతికి అతనిని అప్పగింపలేదు.