క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలోనుండి పంపివేయగా, యెహోవాయొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు.
02 రాజదేహసంరక్షకుల కధిపతి యిర్మీయాను అవతలికి తీసికొపోయి అతనితో ఈలాగు మాటలాడెను ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా.
03 తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీగతి పట్టినది.
04 ఆలకించుము, ఈ దినమున నేను నీచేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతోకూడ బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినయెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను; అయితే బబులోనునకు నాతోకూడ వచ్చుట మంచిదికాదని నీకు తోచినయెడల రావద్దు, దేశమంతట నీకేమియు అడ్డములేదు, ఎక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో, యెక్కడికి వెళ్లుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్లుము.
05 ఇంకను అతడు తిరిగివెళ్లక తడవుచేయగా రాజదేహసంరక్షకుల కధిపతి అతనితో ఈలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణములమీద నియమించియున్నాడు, అతనియొద్దకు వెళ్లుము; అతనియొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా
06 యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితో కూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.
07 అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.
08 కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయకాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.
09 అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.
10 నేనైతేనో నాయొద్దకు వచ్చు కల్దీయుల యెదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని, మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి.
11 మోయాబులో నేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములో నేమి యేయే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు
12 అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి.
13 మరియు కారేహ కుమారుడైన యోహానానును, అచ్చటచ్చటనున్న సేనల యధిపతులందరును మిస్పాలోనున్న గెదల్యాయొద్దకు వచ్చి
14 నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.
15 కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను నీయొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేల? దయచేసి నన్ను వెళ్లనిమ్ము, ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను.
16 అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో ఇష్మాయేలునుగూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవాకార్యము చేయకూడదనెను.